‘‘అస్తిత్వప్రపంచమున ప్రార్ధనకన్న మధురతరమైన దెద్దియునులేదు. మానవుడు ప్రార్థనాస్థితియందు జీవింపవలె. ప్రార్ధనాపూర్వకమును, అభ్యర్ధనా యుతమును నగు స్థితి శుభతరస్థితి. ప్రార్థన భగవంతునితో సంభాషణము. సమున్నతసాధనయేని, సుమధురస్థితియేని భగవంతునితో సంభాషణమే దక్క వేరొండు కాదు.’’


అబ్దుల్-బహా

భారతదేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సమిష్టి ఆరాధనకు సంబంధించిన సమావేశాల సత్వరవికాసం గోచరిస్తున్నది. ప్రజలు ప్రార్థనలను పంచుకోవడానికీ, పవిత్రలేఖనాలను అధ్యయనం చేయడానికీ, తమ జీవితాల అంతరార్ధాలను గురించి సమాలోచించుకోవడానికీ, మాస, వార, రోజువారీప్రాతిపదికనకూడా, పలువిధ పరిస్థితులలో, వేలాదిమంది సమావేశాలను జరుపుకుంటున్నారు. భిన్నవయోవర్గాలకూ, నేపథ్యాలకూ చెందిన ఈ చిన్నచిన్న మిత్రసమాగమాలు, వాటిలో పాల్గొనేవారి ఆధ్యాత్మికజీవితాలను సుసంపన్నం చేయడానికీ, ప్రాదేశిక సమైక్యతాబంధాలనూ, సామాజిక బంధాలనూ ఆధ్యాత్మికంగా ప్రగాఢతరం గావించడానికీ ఉపకరిస్తున్నాయి.

అన్ని నేపధ్యాలకు చెందినవారూ ప్రార్థన, ధ్యానాదుల నిమిత్తం సమావేశం కాగల మందిరాలు – న్యూ ఢిల్లీలో కమలమందిరంగా ప్రఖ్యాతి చెందిన బహాయి ఆరాధనామందిరం ఇందుకు చక్కని ఉదాహరణ – సమాజానికి ఉన్నప్పటికీ, దైవస్మరణకై ప్రజలు సమావేశమయ్యే ఏ ప్రదేశమైనా ధన్యత నొందినదే ననీ, అదీ ఆరాధనామందిరమేననీ బహాయిలు విశ్వసిస్తారు. బహాయి దివ్యధర్మంలో పురోహిత లేదా అర్చకవ్యవస్థ అనేది లేనికారణంగా, తన సమాజంలో జరిగే ఆధ్యాత్మిక విస్తరణకు, ఒక ప్రధానవ్యక్తిగా సేవలను అందించవలసిన బాధ్యత సమాజసభ్యులలో ప్రతి ఒక్కరిమీదా ఉంటుంది.