“సమస్త వైభవాన్వితుని మలయపవనములు నాపైకి వీచి, లోకమునందలి సమస్త జ్ఞానమును నాకు బోధించిన యపుడు, నేను నా శయ్యపై అన్యులవలెనే గాఢనిద్రా పరవశుడనైయున్నవాడనే, మరి. నాది కాదిది, సర్వశక్తిమంతుడును, సర్వజ్ఞుడును నగు ఆయనది. . . . ఆయన సర్వప్రేరక ఆమంత్రణములు నన్ను చేరి, నే నాయన ప్రస్తుతిని సమస్తప్రజల యందునను గావించునటు లొనరించినవి.”


బహాఉల్లా

పంధొమ్మిదవ శతాబ్ద మధ్యభాగం, మానవజీవితంలో ఒక నవచైతన్యానికి నాంది పలికింది. ఒకదానివెంట ఒకటిగా ఐరోపా, ల్యాటిన్ అమెరికా, చైనా, ఇండియా, ఉత్తర అమెరికాలలో నిరంకుశ ప్రభుత్వాలనూ, సాంఘికవిధానాలనూ కూలద్రోసేందుకు ప్రజలు ఉద్యమించారు. నిర్లిప్తత, బానిసత్వం అనే సుదీర్ఘరాత్రి నుండి మనిషి ఆత్మ – జాగృతమైనట్లైంది.

మానవన్యాయం, సమానత్వం, ఔన్నత్యాల పరంగా ఒక నూతన సామాజికదృక్పథం కోసం ఆకాంక్ష – సర్వత్రా వ్యక్తమైంది. రానున్న మహత్తర నవయుగారంభానికి సంబంధించిన స్ఫూర్తి అప్పటి కవుల రచనలలో ద్యోతకమైంది. విశ్వకవి రవీంద్రనాథ ఠాకూర్ మాటల్లో: “మానవుడు తన ఆత్మను సర్వజనుల ఆధ్యాత్మిక సమైక్యతలో అన్వేషించుకోవలసిన నవయుగారంభం కోసం తననూ, తన పరిసరాలనూ సిద్ధం చేసుకోవలసిందన్న పిలుపు వర్తమానయుగంలో ప్రతి ఒక్కరికీ వచ్చింది.”

అటువంటి సమయంలో, ప్రపంచంలోని అధికాంశానికి తెలియకుండానే, మానవాళికి పరిపక్వతా సందేశ వాహకుడైన బహాఉల్లా అవతరణంతో భగవంతుని దివ్యసందేశమనే సూర్యుడు ఇరాన్ లో ఉదయించడం జరిగింది. భగవంతుడు ఒక్కడేనని, ఆయననుండే అన్ని మతాలూ వెలువడ్డాయనీ, మానవజాతి ఏకీకరణకు సమయం ఆసన్నమైందనీ ప్రబోధించాడు, బహాఉల్లా.

అటువంటి సమయంలో, ప్రపంచంలోని అధికాంశానికి తెలియకుండానే, మానవాళికి పరిపక్వతా సందేశ వాహకుడైన బహాఉల్లా అవతరణంతో భగవంతుని దివ్యసందేశమనే సూర్యుడు ఇరాన్ లో ఉదయించడం జరిగింది. భగవంతుడు ఒక్కడేనని, ఆయననుండే అన్ని మతాలూ వెలువడ్డాయనీ, మానవజాతి ఏకీకరణకు సమయం ఆసన్నమైందనీ ప్రబోధించాడు, బహాఉల్లా.

పంధొమ్మిదవ శతాబ్దపు మధ్యభాగంలో బహాఉల్లా - ఒక నూతన మతానికి సంస్థాపక ప్రవక్తగా - తన దివ్యలక్ష్యాన్ని ప్రకటించినప్పుడు, ఆయన బోధనలు, వాటిలో వ్యక్తమైన ఆధునిక దృక్పథం కారణంగా, విప్లవాత్మకమైనవిగా ధ్వనించాయి. మానవజాతి ఏకత్వాభిలాష సాకారం కావలసిన తరుణం వచ్చిందన్న ఆయన మౌలిక ప్రబోధానికి - స్త్రీ పురుష సమానత్వం, శాస్త్రవిజ్ఞానానికీ, మతానికీ మధ్య సామరస్యం, స్వతంత్రసత్యాన్వేషణ ఆవశ్యకత, పురోహిత వ్యవస్థ తొలగింపు, సర్వవిధ పక్షపాతాల నిర్మూలన, సార్వత్రిక విద్య వంటి పలు సామాజిక బోధనలు - అదనంగా వచ్చిచేరాయి.

మధ్యయుగాలనాటి మనస్తత్వంలోకి దిగజారిపోయి, ఛాందసభావజాలాన్ని సంతరించుకుని ఉన్న సమకాలీన మత, రాజకీయవర్గాలలో పెనుదుమారాన్ని సృష్టించాయి – ఆయన బోధనలు. ఇరాన్ కు చెందిన షియా వర్గీయులైన మతనాయకులు, ఆయన ప్రభావాన్ని అరికట్టేందుకని, మహాశక్తివంతులైన అనాటి ఇరాన్, అట్టోమాన్ చక్రవర్తుల ఆస్థానాల తోడ్పాటుతో తమ శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఫలితంగా, ప్రభుత్వం బహాఉల్లా ఆస్తిపాస్తులన్నింటినీ జప్తు చేసింది; ఆయనను హింసించారు, ఆయనపై బలప్రయోగం చేశారు, గొలుసులతో బంధించారు. దేశంనుండి దేశానికి బహిష్కరిస్తూ నాలుగు సార్లు ప్రవాస శిక్షకు గురిచేసి, చివరికి, అప్పటి అట్టోమాన్ సామ్రాజ్యంలోనే అత్యంత భయంకర కారాగార నగరమైన అక్కా (ఇప్పటి ఇజ్రాయల్ లోని అక్కో) కు ఆయనను బహిష్కరించారు. అక్కడే 1892 లో దివంగతు డయ్యాడు, బహాఉల్లా.

చెప్పరాని బాధలకు తాను గురౌతున్నప్పటికీ, మానవాళికి మార్గదర్శకత్వాన్ని వహించేందుకై వందలాది సంపుటాల పవిత్రలేఖనాలను వెలువరిస్తూ, తన దివ్యలక్ష్యాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు బహాఉల్లా. మానవాళి అందుకోగల మహౌన్నత్యం పట్లనూ, అది తన యథార్ధలక్ష్యాన్ని అందుకునే పరివర్తనాబీజాలను వేయకుండా యెంతటి ఆవేదనైనా, త్యాగమైనా తనను నిరోధించలేదన్న వాస్తవంపట్లనూ, తిరుగులేని విశ్వాసం ఉన్న దాయనకు. శత్రువులనుండి తీవ్రవ్యతిరేకత ఎదురౌతున్నప్పటికీ, బహాఉల్లా జీవితకాలంలో ఆయన ప్రభావం ఇంతింత అనరానంతగా పెరిగిపోయింది. ప్రవాసిగా ఆయన ఎక్కడికి తరలివెళ్లినా, అక్కడి ప్రజానీకం వేలాదిగా ఆయన బోధనలకూ, ఆ దివ్యమూర్తి చూపిన వాత్సల్యానికీ, శక్తికీ, అధికారానికీ ఆకర్షితులైనారు. సమైక్యప్రపంచాన్ని నిర్మించేందుకై ఆయన జీవితంనుండీ, ప్రవచనాలనుండీ స్ఫూర్తిని పొందుతున్న ఆరు మిలియన్ల మంది అనుయాయులతో, మరెందరో జిజ్ఞాసువులతో ఈనాడు ఆయన దివ్యధర్మం ప్రపంచమంతటా విస్తరించి ఉన్నది.

బహాఉల్లా ఇంకొన్నాళ్లకు దివంగతు డౌతాడనగా, ఆయనను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రాచ్యఅధ్యయనాల ఆచార్యుడైన ఎడ్వర్డ్ గ్రాన్ విల్లీ బ్రౌన్ సందర్శించాడు. బహాఉల్లా రూపురేఖలను గురించిన ఈ అద్భుత వివరణను భావితరాలకోసం వదిలివెళ్లాడతను: “నేను దర్శించిన ఆ మూర్తి ముఖాన్ని నేను వర్ణించలేకపోయినా, ఎన్నటికీ మరువలేను. తీక్షణమైన ఆ నేత్రాలు, మనిషి మనస్సునే చదువుతున్నట్లుగా ఉన్నాయి. శక్తీ, అధికారమూ ఆయన విశాలఫాలంపై పీఠం వేసుకుని ఉన్నాయి. . . రాజులు అసూయ చెందినా, చక్రవర్తులు నిట్టూర్పులు విడచినా లభించనటువంటి ప్రేమానురాగాలకు ప్రధాన లక్ష్యమూర్తి అయిన ‘ఆయన’ ఎదుటనే నేను ప్రణమిల్లి ఉండగా, ఇక నేనెవరి సమక్షంలో నిలబడి ఉండిఉంటానో వేరుగా అడగనవసరం లేదు!”

Exploring this topic:

The Life of Bahá’u’lláh

The Early Bahá’í Community

The Shrine of Bahá’u’lláh

Quotations

Articles and Resources

Scroll Up