‘‘భగవంతుని ధర్మమును, ఆయన మతమును చైతన్యవంత మొనరింపుచున్న ప్రధానలక్ష్యము – మానవాళి ప్రయోజనములను పరిరక్షించి, ఐక్యతను ప్రోత్సహించి, మానవులయందున వాత్సల్యాన్విత స్నేహస్ఫూర్తిని పెంపొందించుటయే.’’


బహాఉల్లా
 
 
 
 

ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ సుసంపన్నమైన సమాజాలను నిర్మించేందుకు ప్రపంచవ్యాప్తంగా - నగరాలలో, పట్టణాలలో, గ్రామాలలో - లక్షలాదిమంది బహాయిలు కృషిచేస్తున్నారు. మరింత మెరుగైన ప్రపంచాన్ని నిర్మించాలని ఆకాంక్షిస్తున్న సాటి ప్రజానీకంతో చేతులు కలిపి, దైవారాధనమీదా, సేవలమీదా కేంద్రీకృతమైన కార్యక్రమాలద్వారా ఒక నవీననాగరికతకు పునాదులను వేసేందుకు, వారు శ్రమిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత నవీనమైన బహాయి దివ్యధర్మాన్ని అనుసరిస్తున్నవారికి ఈ ప్రయత్నాలొక బృహత్తర అంతర్జాతీయకార్యక్రమం; మానవాళిని ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ మమేకం గావించడమే – ఆ కార్యక్రమ పరమావధి.

అండమాన్ అరణ్యాలనుండి ముంబయి మహాభవనాల వరకూ, తమిళనాడు సాగరతీరంనుండి సిక్కిమ్‌ సమున్నత పర్వతశిఖరాలవరకూ నివసిస్తున్న ప్రతి సామాజిక నేపధ్యంనుండి వచ్చినవారూ – భారతీయ బహాయిలలో ఉన్నారు. సమిష్టి ఆరాధనాసమావేశాలకు, కౌమారప్రాయుల, వయోజనుల ఆధ్యాత్మిక శిక్షణాతరగతులకు తమ నివాసాలలో స్వాగతం పలుకుతూ – వారు, తమ విభిన్న ప్రాంతీయ స్థితిగతులకు అనుగుణంగా, స్థానికులతో కలిసి సమైక్యత, న్యాయం, సమాజహితంపట్ల అంకితభావం వంటి లక్షణాలను సంతరించుకున్న సామాజికజీవనశైలి నొకదానిని నెలకొల్పేందుకు సంయుక్తంగా కృషిచేస్తున్నారు.

సువిశాలమూ, ప్రాచీనమూ, వైవిధ్యభరితమూ అయిన భారతదేశం ఇరవయ్యొకటవ శతాబ్దంలోకి తన పయనాన్ని మహోదాత్తంగా సాగిస్తున్న తరుణాన, దాని ఎదుట–భవిష్యత్తులోకి దారితీసే సరిక్రొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఈ భవిష్యత్తు కల్పించే అవకాశాలూ, సవాళ్లూ వ్యక్తులనుండీ, వ్యవస్థలనుండీ, సమాజాలనుండీ ఆధ్యాత్మికపరిణితి పరంగానూ, మేధోపరంగానూ ఒక వినూత్నస్థాయిని ఆశిస్తున్నాయి.

న్యాయం, సమైక్యతల ఆధారంగా ప్రపంచాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన ఆధ్యాత్మిక అవగాహనలనూ, శాస్త్రీయదృక్పథాన్నీ దేశంలోని జనసామాన్యానికి అందించగల సామర్ధ్యనిర్మాణ, ఇంకా జ్ఞానార్జనా ప్రక్రియలకు భారతీయ బహాయిసమాజం సంపూర్ణంగా కట్టుబడి ఉంది.


నవీకృత మతం

చరిత్ర మొత్తంమీదా చూసుకుంటే, మానవాళికి భగవంతుడు అనేకమంది దివ్యదూతల రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మన ఈ నవయుగానికి ఆధ్యాత్మిక, సామాజిక బోధనలతో నవ్యదివ్యదూతగా అవతరించిన మహోన్నతుడు, బహాఉల్లా.


ఇంకా చదవండి...

సమాజనిర్మాణం

ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ అభ్యున్నతిని సాధించే సమాజాల నిర్మాణానికి భారతదేశవ్యాప్తంగా, అన్ని నేపధ్యాలవారూ, భిన్నవిభిన్న పరిస్థితులలో పునాదులను వేస్తున్నారు. దైవారాధన-సేవ అన్న అంశాన్ని కేంద్రబిందువుగా చేసుకుని కొనసాగే కార్యక్రమాలతో, వారు ప్రజాసంక్షేమానికి కృషి చేస్తున్నారు.


ఇంకా చదవండి...

ఆరాధనా మందిరం

సమాజజీవితానికి సంబంధించి పరస్పర సంబంధమున్న దైవారాధన, సేవ అన్న రెండు అంశాలను అనుసంధానిస్తున్నది - బహాయి ఆరాధనా మందిరం. మతం యొక్క ఏకత్వానికి, భగవంతుని దివ్యదూతల లేదా దివ్యావతారాల బోధనలన్నీ అంతిమంగా ఒకే వాస్తవానికి దారితీసే ద్వారాలు అన్న భావనకు - ప్రతీక, బహాయి ఆరాధనా మందిరం.


ఇంకా చదవండి...