‘‘నా సౌందర్యమునకును, మహిమకును ఆవాస మొనరించుకొనిన మనుష్యహృదయమును తప్ప, భూస్వర్గస్థితమగు సమస్తమును నీ కొఱకే నిర్దేశించినాను.’’బహాఉల్లా

కాలం గడుస్తున్నకొద్దీ, అసంఖ్యాక ప్రజానీకం – బహాఉల్లా బోధనలలో మరింత మెరుగైన ప్రపంచసృష్టినిగురించిన, అది సాకార మయ్యేందుకు లక్షించబడిన యత్నాలను నిర్దేశించే నియమాల గురించిన –– ప్రగాఢావగాహనలపరంగా, ఎంతో ఉత్తమమైన దార్శనికతను ఏర్పరచుకుంటున్నది. ఎంతోమంది, బహాయి దివ్యధర్మాన్ని మరింతగా అధ్యయనం చేసేందుకూ, దాని నొక దైవమతంగా గుర్తించేందుకూ నిశ్చయించుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో, వారు: మానవస్వభావం గురించీ; భగవంతుడు మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి సంబంధించిన సమస్యల వివరణలనూ; సంబంధిత వ్యాఖ్యలనూ; మానవుని ఈ ఐహిక జీవితపరమావధిని గురించీ; మరణానంతర జీవితస్వభావాన్ని గురించీ; వ్యక్తిగత/ సమిష్టి ఆధ్యాత్మిక జీవననియమావళినీ – అధ్యయనం చేస్తున్నారు. దాని పవిత్రలేఖనాలతోనూ, దాని పరిపాలనను నియంత్రించే నియమనిబంధనలతోనూ పరిచయాన్ని ఏర్పరచుకుంటున్నారు. వీటినీ, తత్సమానాంశాలనూ ఆంగీకరించడ మన్నది – బహాఉల్లా దివ్యబోధనలను వాస్తవరూపంలోకి తీసుకురావడానికి అంకితమైన చైతన్యస్ఫోరక సమాజజీవితంలో పాలుపంచుకునేలా వారికి పథనిర్దేశం గావిస్తుంది. తమ మతవిశ్వాసాలను సాటివారితో పంచుకోవాలని బహాయిలు ఆశించడం సహజం. హృదయంలో విశ్వాసస్ఫూర్తి జ్వలించిన అనుభూతికి లోనైన వారెవరికైనా, బహాయి సమాజంలోకి - దాని నిరంతరాభివృద్ధికీ, చైతన్యానికీ కృషిచేసే ఒక క్రియాశీలక సభ్యునిగా/ సభ్యురాలిగా– ప్రవేశించడానికి స్వాగతమే; అందరూ ఆహ్వానితులే. అయితే, ఈ ప్రక్రియకు మతమార్పిడి, మతాంతరీకరణలాంటి పదాలు, పదబంధాలు అనువర్తించవు; బహాయి దివ్యధర్మంలో మతమార్పిడి అన్నది నిషేధం.

ఈ నేపధ్యంలో ఒక బహాయి తన నమ్మకాలను, విశ్వాసాలను మరొకరితో పంచుకోవడం జరుగుతున్నదంటే, దాని ఉద్దేశ్యం– అవతలి వ్యక్తిని ఏదో విషయాన్నిగురించి ఎలాగోలా ఒప్పించడానికో, దానిని నిరూపించేందుకో ప్రయత్నించడం కాదు. అది కేవలం, మానవజీవితంలోని మౌలికసమస్యల గురించిన అర్ధవంతమైన చర్చలో పాల్గొనడం, సత్యాన్ని అన్వేషించడం, అపోహలను తొలగించడం. ‘‘మీరొక సునిశ్చితసత్యము నెఱిగియుండిన, అటులే, అన్యులకు లభియింపని అమూల్యమణిని పొందియుండిన, దాని నెంతయో కారుణ్యమూ, అత్యంత సద్భావనాయుతమూ అయిన సంభాషణతో వారితో పంచుకొనండి. అది అంగీకరింపబడెనేని, మీ లక్ష్యము నెరవేరినట్లే. ఎవరైనా, త్రోసిపుచ్చినట్లైతే ఆ విషయము నాతనికే విడిచిపుచ్చి, అతడిని సక్రమముగ నడిపింపుమని భగవంతుని ప్రార్ధింపవలె.’’ నంటాడు బహాఉల్లా.

అయితే, కేవలం విశ్వాసవ్యక్తీకరణ మాత్రమే ఉత్తమోత్తమ ప్రపంచనిర్మాణానికి చాలదు. ఏకాగ్రతాపూర్వక కార్యాచరణ సైతం కావలసిందే. ‘‘లిఖియింపబడినదానిని వాస్తవరూపములోనికి, క్రియారూపములోనికి పరివర్తనమొనరించుటకై కృషిసల్పుట అంతర్దృష్టియుతుడును, అవగాహనాప్రపూరితుడును నగు ప్రతి మానవుని విధి,’’ అని బహాఉల్లా వ్రాశాడు."

Scroll Up