bahai india banner lotus temple new delhi

ఆరాధనా మందిరం

‘‘ప్రపంచంలోని సర్వమతస్థుల నిమిత్తమూ ఆరాధనామందిర మొకటి నిర్మితము కావలెననియు, తద్వారా సకలమతములును, వర్గములును, తెగలును దాని సార్వత్రికాశ్రయములోనికి ప్రవేశించుననియు, దాని పవిత్రబాహ్యాంగణములనుండి మానవకోటి ఏకత్వప్రకటనము వ్యక్తమగుననియు బహాఉల్లా ఆదేశించినాడు.’’

- అబ్దుల్-బహా

బహాయిలకు సంబంధించినంత వరకూ, ఆధ్యాత్మికజీవితాన్నీ, ప్రార్థన, ధ్యానాదుల సమయాన్నీ కేవలం వ్యక్తిగత సంతృప్తికోసం వెచ్చించడం జరగదు; ప్రపంచశ్రేయస్సుకై చేపట్టే కార్యక్రమాల్లో తమ ఆధ్యాత్మిక శక్తిసామర్ధ్యాలను వ్యక్తీకరించేందుకు వ్యక్తికీ, సమాజానికీ స్ఫూర్తి నివ్వడానికి అది ఉపకరిస్తుంది.

ఆరాధన, సేవ అన్నవి పరస్పరం అనుసంధానితాలు అన్న దార్శనికతతో, ప్రార్థనలు కార్యరూపంలోకి పరివర్తితా లౌతాయి, ఆ కార్యాలు ఆధ్యాత్మికతను సంతరించుకుంటాయి. క్రియాశీలకత అనే పాదాలతో ఆధ్యాత్మికమార్గంలో, పయనించడానికి వీలౌతుంది. ఆరాధనకు, సేవకు సంబంధించిన లక్షణాలు పరస్పరసంబంధాన్ని కలిగిఉన్న సామాజిక జీవనసరళి ఒకటి భారతదేశవ్యాప్తంగా గ్రామాలలో పట్టణప్రాంతాలలో బలంగా నెలకొంటున్నది.

న్యూఢిల్లీలో కమల్‌మందిర్‌గా పేరొందిన బహాయి ఆరాధనామందిరం, బహాయి జీవితానికి సంబంధించిన ఆరాధన, సేవ అనే ఈ రెండు అంశాలనూ ఒక్కచోటికి సమీకరిస్తుంది. ఆ ఆలయంలో–మతాలన్నిటికీ మూలం ఒక్కటే; భగవంతుని దివ్యసందేశవాహకుల, దివ్యావతారాల బోధనలన్నీ ఒకే వాస్తవికతకు దారితీసే ద్వారాలే నన్నదానికి నిదర్శనంగా, 9 ప్రవేశద్వారాలతో సువిశాల ప్రార్ధనామందిరం ఒకటి ఉంటుంది. ధ్యానపూర్వక ప్రార్ధనల నిమిత్తం సందర్శకులను సంసిద్ధం చేసేందుకుగాను ఆలయంచుట్టూతా హరితవనాలున్నాయి. ప్రజలభౌతిక, విద్యాపరమైన అవసరాలను తీర్చే పలు ఉపసంస్థలు ఆలయం చుట్టూతా, అత్యంత సమీపాన అభివృద్ధిచెందాలని ఆశించడం జరిగింది. ఆలయంలో నిత్యప్రార్థన, ధ్యానాదులతో ఉత్పన్నమైన స్ఫూర్తి— ఢిల్లీ- ఎన్.సి.ఆర్. పరిసరాలలోనూ, ఇంకా సుదూర ప్రాంతాలలోనూ చేపట్టబడుతున్న పలు సమాజనిర్మాణ కార్యకలాపాలలోనూ వినిమయమౌతున్నది.