దివ్యధర్మం అవతరించిన నాటినుండీ, బహాయి చరిత్రకు భారత ఉపఖండంతో సాన్నిహిత్యం ఉంది. బాబ్‌ను అనుసరించిన తొలితరం అనుయాయి సయీద్-ఎ-హిందీ ఉపఖండానికి చెందినవాడే. అతనిలాగే, బాబ్ దివ్యత్వస్థాయిని గుర్తించి, ఆయనను అనుసరించిన వారెందరో భారతదేశంలో ఉండేవారు. బాబ్ ధార్మికపాలనాకాలంలో ఆయన బోధనల వెలుగులు, భారతదేశంలో బొంబాయి (నేటి ముంబయి), హైదరాబాదువంటి నగరాలకూ, జౌనాపూర్, రామ్‌పూర్, పాలంపూర్ వంటి గ్రామీణప్రాంతాలకూ ప్రసరించాయి.
భారతదేశానికి బహాఉల్లా బోధనలను తొలిసారిగా 1872లో తీసుకువచ్చిన జమాల్ ఎఫెండీ అనే పారశీక ప్రముఖు డొకాయన ఉపఖండమంతటా పర్యటించాడు. ఉత్తరాదిన రామ్‌పూర్ నుండి లక్నో (నేటి లఖ్‌నవూ) కూ, తూర్పున కలకత్తా (నేటి కోల్‌కటా) నుండి రంగూన్ (నేటి యాంగాన్) కూ, పశ్చిమాన బరోడా (నేటి వడోదర) నుండి బొంబాయి (నేటి ముంబయి) కీ, దక్షిణాదిన మద్రాసు (నేటి చెన్నై) నుండి కొలంబోవరకూ తన పర్యటనలను కొనసాగించా డతను. నాటి నవాబులు, రాకుమారులు, వలస రాజ్యపాలకులనుండి, సాధారణ ప్రజానీకంవరకూ – తాను కలుసుకున్న ప్రతి ఒక్కరికీ – స్నేహసమైక్యతలకు సంబంధించిన బహాఉల్లా బోధనలను పరిచయం చేశాడు జమాల్ ఎఫెండీ. సమకాలీన సామాజిక నియమావళికి భిన్నంగా ఉన్నప్పటికీ, సాంఘికస్థాయికీ, కుల, మతవిశ్వాసాలకూ అతీతంగా, అన్ని సమాజాలకూ, నేపధ్యాలకూ చెందిన ప్రజానీకంతో మమేకం అయ్యాడతను.
శతాబ్దాంతానికల్లా బొంబాయి, ఢిల్లీ, పూనా, హైదరాబాదులలో చిన్నచిన్న బహాయి సమాజాలు నెలకొన్నాయి. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్న బహాయి సమాజాల వ్యవహారాలను నిర్వహించేందుకని, ఉపఖండ బహాయిలు – 1923లో తొలిసారిగా జాతీయ పాలనావ్యవస్థను ఎన్నుకున్నారు.
ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశకాలలో భారతీయ బహాయి సమాజం పరిమాణంలోనూ, శక్తిలోనూ అభివృద్ధి చెందుతూ ఉండగా, బహాఉల్లా బోధనలు క్రమంగా నాటి మేధావుల, నేతల దృష్టిని ఆకర్షించ నారంభించాయి. పలువురు బహాయిలతో పరిచయమైన తరువాత ‘‘బహాయి దివ్యధర్మం మానవాళికి ఒక ఉపశమనం,’’ అని వ్యాఖ్యానించారు మహాత్మా గాంధీ. అదే విధంగా, బహాయిలలో పలువురు ప్రముఖులను కలిసిన రవీంద్రనాథ ఠాగూర్ సైతం బహాఉల్లాను గురించి ప్రస్తావిస్తూ, ‘‘ఆసియాలో ప్రభవించిన నవ్యప్రవక్త’ అనీ, ‘‘నాగరికతాభ్యుదయానికి ఆయన సందేశం అత్యావశ్యక,’’ మనీ పేర్కొనడం జరిగింది.
1960వ, 70వ దశకాల్లో, బహాఉల్లా సందేశాన్ని భారతదేశ ప్రజానీకంతో, ప్రత్యేకించి గ్రామీణ జనసామాన్యంతో పంచుకోవడం ఆరంభమైంది. దానితో పరిచయమైనవారి మనస్సుల్లో దివ్యబోధనలకు సత్వర గౌరవమూ, గుర్తింపూ లభించాయి. ఆ బోధనలలో – తమ చిరకాల వాంఛితమైన ‘‘వసుధైకకుటుంబ’’ భావన సాకార మౌతుందన్న ఆశారేఖ వేలాదిమంది భారతీయులకు అగుపించింది. ఆధునిక సమాజావసరాలకు తగినరీతిలో ఈ ప్రబోధాలను అనువర్తించు కోవాలన్న నవ్యస్ఫూర్తి వారికి కలిగింది.
తమ సమాజాలకు ఎదురైన సమస్యలను పరిష్కరించుకునే యత్నంలో వీటిని వినియోగించుకునేందుకు వేలాదిమంది కృషిచేయ నారంభించారు. భారతదేశవ్యాప్తంగా వందలకొద్దీ బహాయి పరిపాలనా వ్యవస్థలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడి, తమతమ ప్రాంతాల అవసరాలను చూసుకో నారంభించాయి. బాలల నైతికవిద్య ఒక సరిక్రొత్త తక్షణావశ్యకతగా పరిణమించింది, దేశవ్యాప్తంగా పలు విద్యాకార్యక్రమాలు అవతరించాయి. 1980ల నాటికి బహాయి బోధనల స్ఫూర్తితో గ్రామీణ ట్యుటోరియల్ పాఠశాలలూ, విద్యాలయాలూ వందలాదిగా నెలకొన్నాయి; వ్యవసాయం, వృత్తివిద్య, అధ్యాపకశిక్షణ, అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ, మహిళా సశక్తీకరణ, ఆరోగ్యం వంటి పలురంగాలకు చెందిన పథకాలు అమలులోకి వచ్చాయి.
మానవ హృదయపరంగానూ, సమాజపరంగానూ బహాఉల్లా ఆశించిన పరివర్తనకు ప్రతీకగా ప్రపంచఖ్యాతిని సంతరించుకున్నది – న్యూఢిల్లీలోని బహాయి ఆరాధనామందిర నిర్మాణం. వికసిస్తున్న కమలం ఆకారంలో ఉన్న ఆ మందిరం – దుర్భరతర పరిస్థితులలో సైతం ఒక సరిక్రొత్త, మెరుగైన ప్రపంచం అవతరించడం సాధ్యమేనని ధృవీకరిస్తున్నది. సమైక్యతకు ప్రతీకగా కూడా పేరొందింది ఆ ఆలయం. 1986లో ప్రారంభోత్సవం జరిగిననాటినుండీ, అన్ని మతాలకూ, జాతులకూ, దేశాలకూ చెందిన ప్రజలు – సగటున రోజుకు పదివేలమంది వరకూ – దానిని సందర్శించడం జరుగుతున్నది; తమ సృష్టికర్తను మౌనంగా ఆరాధించుకునేందుకూ, ధ్యానించుకునేందుకూ గాను, వారు దాని అంతరాలయంలో సమావే మౌతుంటారు.
పరిమాణంలోనూ, సామర్ధ్యంలోనూ ప్రవృద్ధ మౌతున్న భారతీయ బహాయిసమాజం, సాంఘికజీవితంలో మరింత ప్రధానపాత్రను పోషించ నారంభించింది. మతసామరస్యం, మహిళాసాధికారత, విద్య, స్త్రీ-పురుషసమానత్వం, పరిపాలన-అభివృద్ధివంటి రంగాలలో ఆలోచనాసరళిని మలిచి, అభివృద్ధి చేయడంలో బహాయిల సహాయసహకారాలు పలు జాతీయవేదికలపై అపార గౌరవాన్ని సంపాదించుకున్నాయి.
ఈనాడు భారతీయ బహాయిల సంఖ్య ఇరవై లక్షలకు పైమాటే. సమైక్యతకూ, న్యాయానికీ ప్రతిరూపాలూ, సకలవిధ పక్షపాతరహితాలూ, స్త్రీపురుషులు సమభావంతో సమిష్టిగా సంఘాన్ని సేవించేవీ, బాలలూ, యువజనులూ ఆధ్యాత్మిక, వైజ్ఞానిక విద్యలను అభ్యసించగలిగేవీ, హానికర సాంఘిక శక్తుల బారినుండి ఆధ్యాత్మిక జీవితసహకారంతో, తమనుతాము కాపాడుకునేవీ అయిన సమాజాల నిర్మాణంలో, తమ సాటివారితో కలిసి కృషిచేయడం ద్వారా, తమ మాతృదేశాన్ని సేవించేందుకు వారు అంకితమై ఉన్నారు.