bahai india banner abdulbaha

అబ్దుల్-బహా

“ ఇప్పుడూ, ఎప్పుడూ ఆయనను. . . బహాఉల్లా అనుపమాన, సర్వావృత ఒడంబడికకు కేంద్రముగా, మూలబిందువుగా, ఆయన మహోదాత్తలీలగా, ఆయన దివ్యశోభకు స్వచ్ఛమైన దివ్యదర్పణంగా, ఆయన దివ్యబోధనలకు పరమాదర్శ మూర్తిగా, ఆయన దివ్యవాక్కులకు అధీకృత వ్యాఖ్యాతగా, మూర్తీభవించిన బహాయి సిద్ధాంతసర్వస్వంగా, . . . మానవకోటి ఏకత్వప్రేరణశక్తిగా, పరిగణించాలి. ”

- షోఘి ఎఫెండీ

బహాఉల్లా పెద్దకుమారుడైన అబ్దుల్-బహా, 20వ శతాబ్దపు తొలి నాళ్లలో, బహాయి దివ్యధర్మానికి ప్రధాన ప్రతినిధిగా, సామాజికన్యాయ సమర్ధకుడిగా, ప్రపంచశాంతి రాయబారిగా ప్రసిద్ధి చెందాడు.

తక్కిన మతాలకు వాటి సంస్థాపకుల మరణాల అనంతరం పట్టిన దుస్థితి, తాను స్థాపించిన మతానికి ఎన్నటికీ పట్టకూడదన్న లక్ష్యంతో, సమైక్యతను తన బోధనలకు మూలసూత్రంగా తీసుకుని, అవసరమైన రక్షణచర్యలను తీసుకున్నాడు బహాఉల్లా. బహాయి దివ్యలేఖనాలకు అధీకృత వ్యాఖ్యాతగా మాత్రమే కాక, దివ్యధర్మస్ఫూర్తికీ, బోధనలకూ ప్రధాన ఆదర్శమూర్తిగాకూడా తన పెద్దకుమారుడైన అబ్దుల్-బహాను ఆశ్రయించవలసిందని, తన లేఖనాలలో అందరినీ ఆదేశించా డాయన.

బహాఉల్లా దివంగతుడైన తరువాత, స్వభావరీత్యానూ, జ్ఞానపరంగానూ, మానవసేవానిరతి పరంగానూ, అబ్దుల్-బహాకుగల అసాధారణ లక్షణాలు బహాఉల్లా బోధనలకు చక్కని క్రియారూపాన్నిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా త్వరితగతిన విస్తరిస్తున్న సమాజానికి అపార గౌరవప్రతిష్ఠలను చేకూర్చాయి.

అబ్దుల్-బహా తన ధార్మికపాలనాకాలాన్ని తన తండ్రి స్థాపించిన దివ్యధర్మాన్ని మరింతగా విస్తరింపచేసేందుకు వెచ్చించాడు. ఆయన స్థానిక బహాయి వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించాడు. వర్ధమాన విద్యా, సామాజిక, ఆర్ధిక కార్యక్రమాలకు దిశానిర్దేశం గావించాడాయన. యావజ్జీవ కారాగారబంధనంనుండి విముక్తుడైన తరువాత ఆయన ఈజిప్టునూ, ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాలనూ సందర్శించేందుకని పర్యటనలు చేశాడు. సమాజపు ఆధ్యాత్మిక, సాంఘిక పునరుజ్జీవనానికై బహాఉల్లా సూచించిన దివ్యౌషధాన్ని, తరతమభేదాలకు తావీయకుండా, అద్భుత ప్రతిభతో తన జీవితాంతం వరకూ అందిస్తూనే వచ్చాడాయన.

Exploring this topic: