bahai india banner shoghi effendi

షోఘి ఎఫెండీ

“ఆతడు భగవచ్ఛిహ్నము, నియుక్తశాఖ, భగవంతుని దివ్యధర్మసంరక్షకుడు, ఆయన ప్రియతములు ఆశ్రయించ వలసినవాడు. భగవద్వచనములకు వివరణకర్త....”

- అబ్దుల్-బహా

సమైక్యప్రపంచాన్ని సృష్టించడమన్న లక్ష్యాన్ని తన దివ్యావిష్కరణం తప్పక సాధించేందుకూ, బహాయి సమాజపు సమైక్యతను పరిరక్షించేందుకూ గాను బహాఉల్లా తన పెద్దకుమారుడైన అబ్దుల్-బహాను, తన దివ్యఒడంబడికకు కేంద్రంగా నియమించి, విశ్వన్యాయమందిర స్థాపనను నిర్దేశించాడు. ఆ ప్రకారం, అబ్దుల్-బహా విశ్వన్యాయమందిర విధినిర్వహణకు మూలసూత్రాలను ఏర్పరిచాడు. తన అనంతరం, బహాయిలు, తాను బహాయి దివ్యధర్మానికి సంరక్షకునిగా నియుక్తం గావించిన తన పెద్దమనుమడు షోఘి ఎఫెండీని ఆశ్రయించాలని నిర్దేశించాడాయన.

మూలసూత్రాలను అనువర్తిస్తూ, శాసనాలకు ప్రచురతను కల్పిస్తూ, వ్యవస్థలను సంరక్షిస్తూ, నిత్యపురోగమనశీల మానవసమాజపు టవసరాలకు అనుగుణంగా బహాయి దివ్యధర్మాన్ని వినియోగిస్తూ ఉండవలసిన బాధ్యతను ధర్మసంరక్షకుడికీ, విశ్వన్యాయమందిరానికీ అప్పగించడం జరిగింది.

అసాధారణ దూరదృష్టితో, విజ్ఞతతో, అంకితభావంతో సక్రమ విధానంలో, దివ్యధర్మాభివృద్ధిని కొనసాగించాడు షోఘి ఎఫెండీ; యావత్ మానవాళి వైవిధ్యాన్నీ ప్రతిఫలిస్తూ బహాయి సమాజం విస్తరిస్తూ పోయేకొద్దీ, సంబంధిత అవగాహనలను పెంపొందించాడు, సమాజపుటైక్యతను పటిష్టపరిచాడు.

సమాజవ్యవహారాల నిర్వహణకోసం బహాఉల్లా రూపొందించిన అసాధారణ విధానం, షోఘి ఎఫెండీ మార్గదర్శకత్వంలో శరవేగంగా, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. ఆయన – బహాయి పవిత్రలేఖనాలను ఆంగ్లంలోకి అనువదించాడు, పవిత్రభూమిలో దివ్యధర్మపు టాధ్యాత్మిక, పరిపాలనాకేంద్రాన్ని అభివృద్ధి చేశాడు; తాను వ్రాసిన వేలాది లేఖలలో మానవాళి భవితగురించిన మహాదృక్పథాన్ని ఆవిష్కరిస్తూ నాగరికతకూ, సామాజిక పరివర్తనా విశిష్టత యొక్క ఆధ్యాత్మికపార్శ్వం గురించిన లోతైన అవగాహనలను కలిగించా డాయన.

Exploring this topic: