ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంక్షోభయుత ఘట్టాలలో ఒకటైన 19 వ శతాబ్దపు మధ్యభాగంలో మానవజాతి జీవితగమనాన్ని పరివర్తన చెందించేందుకు ఉద్దేశితమైన ఒక దివ్యసందేశాన్ని తీసుకువచ్చానని ప్రకటించా డొక యువ వ్యాపారి. ఆయన సందేశం – స్వదేశమైన ఇరాన్ విస్తృతస్థాయిలో నైతికపతనానికి లోనౌతున్న ఆ సమయంలో – వేలాదిగా అనుయాయులను ఆకర్షిస్తూ, అన్ని వర్గాలలోనూ ఉత్సాహాన్నీ, ఆశలనూ రేకెత్తించింది. ఆయన “బాబ్” (ఈ అరబ్బీ భాషాపదానికి అర్ధం – మహాద్వారం) అన్న బిరుదనామంతో ప్రసిద్ధుడయ్యాడు.
ఆధ్యాత్మిక, నైతిక సంస్కరణల నిమిత్తం బాబ్ ఇచ్చిన పిలుపుతోనూ, మహిళల, పేదల స్థాయి మెఱుగుదలకు ఆయన ఇచ్చిన విశేషప్రాధాన్యత దృష్ట్యానూ – ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ఆయన ఇచ్చిన సూచనలు ఒకవిధమైన విప్లవాత్మకతను సంతరించుకున్నాయి. అదే సమయంలో, తమ జీవితాలలో పరివర్తనను తెచ్చుకోవలసిందిగానూ, ధీరోచిత కార్యక్రమాలను చేపట్టవలసింది గానూ తన అనుయాయులకు స్ఫూర్తినిస్తూ, తనదైన విశిష్ట, సర్వస్వతంత్ర మతం ఒక దానిని సంస్థాపించా డాయన.
మానవాళి ఒక నవ్యయుగ ద్వారం ముంగిట నిలిచి ఉన్నదని ప్రకటించాడు బాబ్. ఆయన ముందున్న మహత్కార్యం: ప్రపంచ మతాలన్నింటా వాగ్దత్తమూ, శాంతి, న్యాయ ప్రపూరితమూ అయిన ఒక దివ్యయుగంలోనికి మానవాళిని నడిపించబోయే భగవంతుని దివ్యావతారమైన బహాఉల్లా ఆగమనం కోసం మార్గాన్ని సంసిద్ధం చేయడం.